ప్రయాణంలో ‘వినోదం’.. రైల్యే శాఖ కొత్త ప్రయోగం

  • ఆఫ్‌లైన్‌లో మల్టీమీడియా సేవలందిస్తున్న రైల్వేశాఖ
  • అందుబాటులో ‘మ్యాజిక్‌బాక్స్‌’ వైఫై ఇన్పోటైన్‌మెంట్‌ సిస్టమ్‌
  • కాచిగూడ-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా అమలు

దక్షిణ మధ్య రైల్వేశాఖ మరో కొత్త సౌకర్యంతో ముందుకు వచ్చింది. ఇప్పటివరకు స్టేషన్లలో వైఫై, టెలివిజన్‌ ప్రసారాలు, ఇతర సాంకేతిక మాద్యమాలతో ఆకట్టుకుంటున్న అధికారులు తాజాగా ఆఫ్‌లైన్‌లో మల్టీమీడియా సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ‘మ్యాజిక్‌ బాక్స్‌’ వైఫై ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా రైలు నంబర్‌ 12785 కేఎస్ఆర్‌ బెంగళూరు కాచిగూడ-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లోని ఐదు ఏసీ కోచ్‌ల్లో 6 మ్యాజిక్‌ బాక్స్‌లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు.
కాగా, ఈ మ్యాజిక్‌బాక్స్‌ వ్యవస్థను న్యూఢిల్లీకి చెందిన మెసర్స్‌ ఎస్‌ఆర్‌ మూవింగ్‌ టాకీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ సరఫరా చేసింది. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు మ్యాజిక్‌బాక్స్‌ వ్యవస్థ న్యూఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, ముంబయి రాజధాని ఎక్స్‌ప్రెస్‌, లక్నో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. కాచిగూడ-బెంగళూరు ఎక్స్‌ప్రె్‌సలో మల్టీమీడియా సేవలు విజయవంతమైతే మరికొన్ని రైళ్లలో అమలు చేయనున్నారు.

మ్యాజిక్‌ బాక్స్‌ ఉద్దేశం..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే వివిధ ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లలో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రవాణాలో వినోదం కల్పించేందుకు రైల్వేశాఖ మ్యాజిక్‌ బాక్స్‌ వ్యవస్థను అందు బాటులోకి తీసుకొచ్చింది. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఇంటర్‌నెట్‌ అవసరం లేకుండానే ప్రయాణికులు తమ సెల్‌ ఫోన్లు, లాప్‌టా్‌పలను వైఫై ద్వారా మ్యాజిక్‌ బాక్స్‌తో అనుసంధానమైతే 500 నిడివి కలిగిన వినోద కార్యక్రమాలను ఆనందంగా చూస్తూ ప్రయాణించవచ్చు.
కాగా, ప్రయాణికులు ఇంగ్లిష్‌, హిందీ, ప్రాంతీయ భాషల్లో కూడా సినిమాలను వీక్షించవచ్చు. పిల్లలు కూడా కార్టూన్లు, పాటలు పొందవచ్చు. ఆసక్తి కలిగిన ప్రయాణికులు మ్యాజిక్‌బాక్స్‌లో లభించే రైల్వే, ఇతర ప్రభుత్వ విధానాలకు, పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని తమ విజ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది.

మ్యాజిక్‌ బాక్స్‌ను పొందే విధానం..
  • తొలుత సెల్‌ఫోన్‌, లాప్‌టా్‌పలోని సెట్టింగ్స్‌కు వెళ్లాలి.
  • తర్వాత వై-ఫై ఆప్షన్‌కు వెళ్లాలి.
  • అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌లలో సెల్‌ఫోన్‌, లాప్‌టా్‌పలకు ‘మ్యాజిక్‌ బాక్స్‌’ను కనెక్టు చేసుకోవాలి.
  • కనెక్షన్‌ వచ్చిన తర్వాత బ్రౌజర్‌కు వెళ్లాలి.
  • బ్రౌజర్‌ విండో మీద మ్యాజిక్‌ బాక్స్‌ డాట్‌ కామ్‌ అని టైప్‌ చేయాలి.
  • ప్రారంభించేందుకు బొటన వేలి ముద్రను క్లిక్‌ చేయాలి.
  • కంటెంట్‌ యాక్సెస్‌ కోసం వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ చేయాలి.
  • తర్వాత మీకు నచ్చిన కార్యక్రమాలను చూసి ఆనందించండి.

Comments