ఫేస్‌బుక్‌ ‘ట్రాక్‌’.. ఇలా ‘బ్లాక్‌’

ఫేస్‌బుక్‌ ‘ట్రాక్‌’.. ఇలా ‘బ్లాక్‌’
మీరు కావాలనుకుంటేనే యాడ్స్‌.. లేకుంటే లేదు!

‘‘ఈ ఫేస్‌బుక్‌ వాడికి మన విషయాలు ఎలా తెలిసిపోతున్నాయో... నేను ఎక్కువగా సెర్చ్‌ చేసే వస్తువులకు సంబంధించిన యాడ్‌లే చూపిస్తున్నాడు’’అని చాలాసార్లు అనుకునే ఉంటారు. మీరే కాదు చాలామంది ఇలానే అనుకుంటారు. దానికి కారణం ఫేస్‌బుక్‌ మీ ఇంటర్నెట్‌ వినియోగాన్ని ట్రాకింగ్‌ చేస్తుంటుంది. అసలు ఇది ఎలా జరుగుతుంది. ఒకవేళ ట్రాకింగ్‌ వద్దు అనుకుంటే మనం ఏం చేయాలి. ఫేస్‌బుక్‌ ట్రాకింగ్‌ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి అనేక విషయాలు మీ కోసం...!
ఎలా తెలుసుకుంటుంది?
మీ సమాచారం తెలుసుకోవడానికి ఫేస్‌బుక్‌ రకరకాల పద్ధతులను అనుసరిస్తుంది. అందులో మొదటిది మీ ఫేస్‌బుక్‌, ఇస్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్స్‌ ఆధారంగా మీ ఆసక్తులు, వయసు తదితర విషయాలను తెలుసుకుంటారు. మీరు ఫేస్‌బుక్‌లో ఎక్కువగా వేటిని లైక్‌, షేర్‌ చేస్తున్నారనే సమాచారం తీసుకుంటుంది. మీ ఫోన్‌ ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ అయిందంటే మీరు ఎక్కడ్నుంచి వినియోగిస్తున్నారో లోకేషన్‌ తెలుసుకుంటుంది. ఆన్‌లైన్‌లో మీరు కొనుగోలు చేసే వాటి వివరాలు, చూసే పేజీలు ట్రాక్‌ చేసి తెలుసుకుంటారు. ఈ వివరాల ప్రకారం ప్రకటనదారులు తమ యాడ్స్‌ను ఫేస్‌బుక్‌ వినియోగదారులకు అందిస్తారు.
ఎలా ట్రాక్‌ చేస్తుంది
ఫేస్‌బుక్‌లో మనం పాస్‌వర్డ్‌ ఇస్తాం... దాని ద్వారా ట్రాక్‌ చేస్తుందా అని కొందరు అనుకుంటుంటారు. కానీ ఇది సరికాదు. ట్రాకింగ్‌ కోసం ఫేస్‌బుక్‌ మీ కంప్యూటర్‌లో ప్రత్యేకమైన ‘కుకీ’ని కలిగి ఉంటుంది. ఆ కుకీ మీ ఫేస్‌బుక్‌ ఐడీ సమాచారంతో యాక్సెస్‌ అవుతుంది. ఆ కుకీ ఉన్న బ్రౌజర్‌లో మీరు చేసే సెర్చ్‌, చూసే వెబ్‌సైట్లు తదితర వివరాల్ని ఫేస్‌బుక్‌కు తెలుస్తాయి. మీరు ఫేస్‌బుక్‌ లాగ్‌ అవుట్‌ చేసినా కూడా ఇంటర్నెట్‌లో మీరు ఏం చేస్తున్నారనేది ట్రాక్‌ చేస్తుంటుంది. అంతేగానీ దీని ద్వారా మీ వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు లాంటివి ఫేస్‌బుక్‌ తీసుకోదు అని సంస్థ చెబుతోంది.
ఇలా మార్చుకోండి
ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అయిన తర్వాత మెను లోకి వెళ్లి సెట్టింగ్స్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. అక్కడ అడ్వర్టైజర్స్‌ సెక్షన్‌లో మీ ఎఫ్‌బీ పేజీ మీద కనిపించే / కనిపిస్తున్న యాడ్స్‌ జాబితా కనిపిస్తుంది. అందులో ఏదన్నా సంస్థకు చెందిన యాడ్‌ వద్దు అనుకుంటే దాన్ని తొలగించేయొచ్చు. ఇక ఆ సంస్థ/ సర్వీసకు సంబంధించిన యాడ్‌లు మీకు కనిపిచవు. మళ్లీ కావాలంటే మీరే యాడ్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో నోటిఫికేషన్లను మ్యూట్‌ చేసే తరహాలో ఎఫ్‌బీలో యాడ్స్‌ను హైడ్‌ చేయొచ్చు. ఇది ఆరు నెలలు, ఒక సంవత్సరం, పూర్తి కాలం అని మూడు ఆప్షన్లు ఉంటాయి. దీంతోపాటు ఫేస్‌బుక్‌ సొంత యాడ్‌లు, పార్టనర్‌ యాడ్స్‌ మీ పేజీలో కనిపించాలా వద్దా అనేదీ మీరే ఎంచుకోవచ్చు. దీని కోసం ఇదే పేజీలోని యాడ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. మీ పుట్టిన తేదీ, మీ ప్రాంతం, చదువు వాటి ఆధారంగా కూడా యాడ్స్‌ వస్తుంటాయి. వాటిని కూడా మీరు నిలువరించవచ్చు. ఈ సెక్షన్‌లోనే ‘యువర్‌ ఇన్ఫర్మేషన్‌’ ఆప్షన్‌ ద్వారా వాటిని కావాలంటే హైడ్‌ చేయొచ్చు. పుట్టిన తేదీ ఆధారంగా మీకు యాడ్స్‌ వద్దు అనుకుంటే ఆ ఆప్షన్‌ను ఆఫ్‌ చేసుకోవడమే.
ట్రాకింగ్‌ ఆపేయడం ఎలా?
ట్రాకింగ్‌ నుంచి రక్షణ కల్పిచండానికి కొన్ని సాఫ్ట్‌వేర్లు, సర్వీసులు కూడా ఉన్నాయి. యూ బ్లాక్‌ ఆరిజిన్‌ అనే సాఫ్ట్‌వేర్‌ని మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా ఫేస్‌బుక్‌ మనల్ని చేసే ట్రాకింగ్‌ నుంచి తప్పించుకోవచ్చు. క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌, ఒపేరా, సఫారీ లాంటి బ్రౌజర్స్‌ ఈ సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉంటాయి. ట్రాకింగ్‌ బారిన పడకుండా ఉండటానికి చాలామంది ఉపయోగించే వాటిలో నో స్ర్కిప్ట్‌ సాఫ్ట్‌వేర్‌ ఒకటి. ప్రైవసీ బ్యాడ్జర్‌ మీ కంప్యూటర్‌లో ఉండటం వల్ల మీకు ఎవరైనా ట్రాక్‌ చేస్తే ఇట్టే తెలిసిపోతుంది. దీని పనితనం చూసుకుంటే... ఇది ట్రాకింగ్‌ సమాచారాన్నిరంగుల ద్వారా తెలుసుకోవచ్చు. ట్రాకింగ్‌ బాక్స్‌లో ఆకుపచ్చ రంగు చూపిస్తుంటే మీ కంప్యూటర్‌ను ఎవరూ ట్రాక్‌ చేయటం లేదని అర్థం, ఒకవేళ పసుపు రంగు చూపిస్తే ట్రాకింగ్‌లో ఉందని అర్థం.
ఈ బ్రౌజర్లు వాడితే మేలు
ఫేస్‌బుక్‌ ట్రాకింగ్‌ నుంచి తప్పించుకోవాలంటే ప్రైవసీ బ్రౌజర్లు వాడితే ఉపయోగకరంగా ఉంటుంది. దీని కోసం కొన్ని బ్రౌజర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఎపిక్‌ బ్రౌజర్‌, టార్‌, బ్రేవ్‌. ఎపిక్‌ ప్రైవసీ బ్రౌజర్‌ 600 రకాల ట్రాకింగ్‌ ప్రయత్నాల నుంచి కాపాడుతుంది. టార్‌ బ్రౌజర్‌ మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ తరహాలోనే పని చేస్తుంది. ఇది కూడా ట్రాకింగ్‌ నుంచి బయటపడటానికి బాగా ఉపయోగపడుతుంది. బ్రేవ్‌ బ్రౌజర్‌ పూర్తిగా ప్రైవసీగా పని చేస్తుంది. ఇది క్రోమియం బేస్డ్‌ బ్రౌజర్‌.

Comments