ఫొటోలు తీయడమూ ఒక కళే!


మన దగ్గర ఎంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ఉన్నప్పటికీ ఫొటోగ్రఫీ మీద కొద్దిపాటి పరిజ్ఞానం లేకపోతే మంచి ఫొటోలు తీయలేం. అందరూ ఫొటోలు తీస్తారు.. కానీ కాస్త భిన్నంగా, సీన్‌ని బట్టి కెమెరా సెట్టింగ్స్‌లో అడ్జెస్ట్‌మెంట్లు చేసుకుంటూ నాణ్యమైన ఫొటోలు తీసేవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. మీరు మంచి ఫొటోలు తీయాలంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 
ఫొటో తీయడమంటే ఫోన్‌ చేతిలోకి తీసుకుని క్యాప్చర్‌ బటన్‌ టాప్‌ చేస్తే చాలని అనుకుంటారు చాలా మంది. ప్రతీ స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలో రెండు రకాల మోడ్‌లు లభిస్తుంటాయి. 1. ఆటో మోడ్‌ 2. మాన్యువల్‌ సెట్టింగ్స్‌. 99 శాతం మంది తాము తీసే ఫొటోలను ఆటో మోడ్‌లో తీస్తుంటారు. అసలు అంతకన్నా మరింత శక్తివంతమైన సెట్టింగ్స్‌ తమ కెమెరాలో ఉంటాయి అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. ఆటో మోడ్‌ ఎంచుకున్నప్పుడు.. చుట్టూ ఉండే లైటింగ్‌ కండిషన్స్‌ ఇతరత్రా అంశాలను తగ్గట్లు కెమెరా ఆటోమేటిక్‌గా ఐఎస్‌ఓ, ఎక్స్‌పోజర్‌, వైట్‌ బ్యాలెన్స్‌ వంటి ముఖ్యమైన సెట్టింగ్‌లను తనంతట తాను చేస్తుంది. అసలు ఇలాంటి సెట్టింగ్స్‌ ఎలా వాడాలో చాలామందికి తెలియకపోవటం వల్ల కూడా ఆటోమోడ్‌ వాడుతూ ఉంటారు.అయితే ఒక్కసారి ఐఎస్‌ఓ, వైట్‌ బ్యాలెన్స్‌ ఎక్స్‌పోజర్‌ వంటివి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకుంటే.. ఇక మీదట మాన్యువల్‌ సెట్టింగ్స్‌ వాడడానికి ఆసక్తి చూపిస్తారు. దాంతో ఒక ఫోటోని అందరూ తీసేటంత అతి సాధారణంగా కాకుండా, మీరు అద్భుతంగా తీయగలుగుతారు.
 
మేన్యువల్‌ సెట్టింగ్స్‌ ఎంచుకున్నప్పుడు కొన్ని బేసిక్‌ విషయాలు గుర్తుంచుకోండి. సెకనులో 1/30 కన్నా తక్కువ షట్టర్‌ స్పీడ్‌ వాడేటప్పుడు మన చేతులు స్థిరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఫొటోలు బ్లర్‌ కావు. అలాగే ఐఎస్‌ఓని 800 కన్నా ఎక్కువగా సెట్‌ చేసినప్పుడు, ఫొటోలు కొద్దిగా చుక్కలు చుక్కలుగా నాయిస్‌ వచ్చే ప్రమాదముంది. అయితే లైటింగ్‌ బాగా తక్కువగా ఉన్నప్పుడు, ఫ్లాష్‌ వల్ల పెద్దగా ప్రయోజనం లేనప్పుడు ఐఎస్‌ఓ పెంచుకుంటే, ఎక్కువ లైట్‌ క్యాప్చర్‌ చేయొచ్చు. అలాగే మీటరింగ్‌ సెట్టింగ్స్‌లో ఫొటోలోని అన్ని ప్రదేశాలు సక్రమంగా ఎక్స్‌పోజ్‌ కావాలంటే సెంటర్‌ మీటరింగ్‌ ఉపయోగించాలి. ఒకవేళ ఒక నిర్దిష్టమైన ఏరియా ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ కావాలంటే స్పాట్‌ మీటరింగ్‌ వాడితే మంచిది.

లైటింగ్‌ జాగ్రత్తలు
అన్నిటికంటే ప్రధానమైన విషయం మనం ఫొటో షూట్‌ చేసేటప్పుడు చుట్టు పరిసరాల్లో తగినంత లైటింగ్‌ ఉండే విధంగా జాగ్రత్త వహించడం. చాలామంది ఇంతకు ముందు చెప్పినట్లు ఫ్లాష్‌ ఉంది కదా అని ఎక్కడపడితే అక్కడ ఫొటోలు తీస్తూ ఉంటారు. ఫ్లాష్‌ని నమ్ముకోవడం కాకుండా, సరైన లైటింగ్‌ ఉన్న ప్రదేశంలోకి వెళ్లడం మంచి పద్ధతి. అలాగే.. మనిషి మొహం మీద లైటింగ్‌ పడేలా ఉండాలి గానీ, వారి వెనక భాగంలో ఎక్కువ లైటింగ్‌ ఉంటే, ఫొటోలు దారుణంగా వస్తాయి.
 
పైన చెప్పుకున్న జాగ్రత్తలతో పాటు వీలైతే ‘రా ఫొటోలు’ క్యాప్చర్‌ చేసి, ఫొటో ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్లలో తర్వాత అడ్జస్ట్‌మెంట్లు చేసుకోవడం, ఎప్పటికప్పుడు మనం కెమెరా లెన్స్‌ శుభ్రంగా ఉండేలా జాగ్రత్త వహించడం, శక్తివంతమైన ఆప్షన్లు కలిగిన థర్డ్‌ పార్టీ కెమెరా యాప్స్‌ ప్రయత్నించడం వంటి అనేక జాగ్రత్తలు తీసుకుంటే అందరి కంటే గొప్ప ఫొటోలు మనం తీయగలుగుతాం.

జూమ్‌ ఎప్పుడంటే..
అనేకమంది ఫొటో తీసేటప్పుడు దూరంగా ఉన్న దృశ్యాలను దగ్గరగా షూట్‌ చెయ్యడం కోసం ఇష్టమొచ్చినట్లు జూమ్‌ వాడేస్తుంటారు. అయితే స్మార్ట్‌ఫోన్‌ కెమెరాల్లో ఎక్కువగా డిజిటల్‌ జూమ్‌ మాత్రమే ఉంటుంది. ఈ మధ్యకాలంలో వస్తున్న డ్యూయల్‌ కెమెరా సెటప్‌ ఫోన్లలో కొన్ని మోడళ్లలో ఆప్టికల్‌ జూమ్‌ కూడా ఉంటోంది. అయితే డిజిటల్‌ జూమ్‌ మాత్రమే ఉన్నప్పుడు... సాధ్యమైనంత వరకు మనం దేన్ని షూట్‌ చేస్తున్నామో ఆ వస్తువు లేదా మనిషికి సమీపంగా మనం వెళ్ళటమే మంచిది. చీటికీ మాటికీ జూమ్‌ వాడితే ఫొటోలో డీటైల్‌ మిస్‌ అవుతుంది.
 
హెచ్‌డిఆర్‌ మోడ్‌ ఎప్పుడు వాడాలి?
 ఇప్పుడు దాదాపు అన్ని ఫోన్స్‌లో హెచ్‌డిఆర్‌ మోడ్‌ లభిస్తోంది. చాలామంది వెనకా ముందు ఆలోచించకుండా దీన్ని వాడేస్తున్నారు. హై డైనమిక్‌ రేంజ్‌ అనే పదానికి సంక్షిప్త రూపం ఈ మోడ్‌. దీన్ని ఎంపిక చేసుకున్నప్పుడు, ఒకే దృశ్యాన్ని మూడు ఎక్స్‌పోజర్‌ లెవల్స్‌లో మూడు ఫొటోలుగా క్యాప్చర్‌ చేసి, చివరిగా దాన్ని ఒకే ఫొటోగా తయారు చేస్తుంది మన ఫోన్‌ కెమెరా. దానివల్ల ఫొటోలో రంగులు చాలా రిచ్‌గా వస్తాయి. అయితే ఈ మోడ్‌ కేవలం కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాలి. ఏదైనా లొకేషన్‌కి వెళ్లినప్పుడు ప్రకృతి దృశ్యాలను ఫొటో తీస్తుంటే హెచ్‌డిఆర్‌ ఉపయోగపడుతుంది. అలాగే నేరుగా సూర్యకాంతిలో ఒక మనిషిని నిలబెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఫొటోలు తీయాల్సి వచ్చినప్పుడు దీన్ని వాడటం మర్చిపోకండి. అలాగే బాగా వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు, బ్యాక్‌గ్రౌండ్‌ బాగా లైటింగ్‌ ఉండి, మీరు చేసే మనిషి, లేదా వస్తువు దగ్గర లైటింగ్‌ బాగా తక్కువగా ఉన్నప్పుడు ఇది పనికొస్తుంది. అయితే, కదిలే వ్యక్తులను, ఆటలు ఆడేటప్పుడు, కదిలే వాహనాలను తీసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ హెచ్‌డిఆర్‌ మోడ్‌ వాడకూడదు. అలాగే కాంట్రాస్ట్‌ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లోనూ, షూట్‌ చేసే ఏరియాలో పెద్ద మొత్తంలో రంగులు ఉన్నట్లయితే ఈ మోడ్‌ అనువుగా ఉండదు.

పలు ఫొటోలు
కొంతమందికి ఫొటో తీయమని కెమెరా చేతికిస్తే సరిగ్గా ఫ్రేమింగ్‌ కూడా చెయ్యకుండా ఒక ఫొటో తీసి ఫోన్‌ మన చేతికి ఇచ్చేసి వెళ్లిపోతారు. తీరా చూస్తే, అందులో కాళ్లూ, చేతులూ, ముఖం సరిగ్గా కనిపించవు. పక్కన ఏవో అనవసరమైన వస్తువులు సీన్‌లో కనిపిస్తూ ఉంటాయి. లేదా డ్రెస్‌ చెదిరిపోయి ఉంటుంది. మనం ఫొటోలు తీసుకునేవి మధురమైన జ్ఞాపకాలు. మళ్లీ మళ్లీ అవి రాకపోవచ్చు. అందుకే వీలైనంత ఎక్కువ ఫొటోలు క్యాప్చర్‌ చేయడం మంచిది. తర్వాత తీరిగ్గా చూసుకొని, అవసరం లేని వాటిని తొలగించుకోవచ్చు.
 
ఫ్లాష్‌ వాడకండి
తాము తీసే ప్రతీ ఫొటోకీ చాలామంది వెనక ముందు ఆలోచించకుండా విచ్చలవిడిగా ఫ్లాష్‌ వాడేస్తూ ఉంటారు. కేవలం తప్పనిసరి అయితే మాత్రమే ఫ్లాష్‌ ఉపయోగించాలి. మామూలు సందర్భాల్లో ఫ్లాష్‌ వాడితే ఫొటోలోని రంగులు వాష్‌ అయినట్టు వస్తాయి, సహజసిద్ధంగా ఉండవు. అంతేకాదు కొంత డీటైల్‌ కూడా మిస్‌ అవుతుంది. అంతేకాకుండా ఇటీవలికాలంలో గూగుల్‌ పిక్సెల్‌ వంటి అనేక ఫోన్లలో లో-లైట్‌ ఫొటోగ్రఫీ గురించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ఫ్లాష్‌ వాడాల్సిన పనిలేకుండానే వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఫొటోలు బాగా వస్తాయి కాబట్టి, ఫ్లాష్‌ వాడకాన్ని తగ్గించండి.
 
పోర్ట్రెయిట్‌ మోడ్‌ ఎప్పుడు?
ఒక మనిషిని గానీ, వస్తువుని గానీ హైలైట్‌ చేసి, బ్యాక్‌గ్రౌండ్‌ బ్లర్‌ చేసే విధంగా పోరె్ట్రయిట్‌ మోడ్‌ చాలామంది వాడుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇది సక్రమంగా పనిచేయదు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌కీ, మనం హైలైట్‌ చేయాలనుకుంటున్న వస్తువుకీ/మనిషికీ మధ్య సరైన వ్యత్యాసం లేనప్పుడు, రెండూ ఒకే రకమైన రంగులు కలిగి ఉన్నప్పుడు పోరె్ట్రయిట్‌ మోడ్‌ అంచులను గుర్తించడం విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని వాడకపోవటమే మంచిది. అలాగే మనం హైలెట్‌ చేయదల్చుకున్న వ్యక్తి గానీ, వస్తువు గానీ కెమెరాకి బాగా దగ్గరగా ఉన్నప్పుడు ఈ పోరె్ట్రయిట్‌ మోడ్‌ ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందుకే ఈ మోడ్‌లో షూట్‌ చేయాలనుకుంటే కొద్దిగా సబ్జెక్ట్‌కి దూరంగా జరగడం మంచిది.

రూల్‌ ఆఫ్‌ థర్డ్‌
ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ రూల్‌ ఆఫ్‌ థర్డ్‌ విధానాన్ని అనుసరించి ఫొటో తీస్తూ ఉంటారు. దీన్ని ఎంచుకున్నప్పుడు కెమెరా వ్యూ ఫైండర్‌ మొత్తం తొమ్మిది ముక్కలుగా విభజించబడుతుంది. ఫొటోలో మీరు ప్రధానంగా ఫోకస్‌ చేయవలసిన ప్రదేశాన్ని నిలువు, అడ్డ గీతలు కలిసే మొత్తం నాలుగు ఇంటర్‌సెక్టింగ్‌ పాయింట్ల మధ్యని ఫ్రేమింగ్‌ చేసుకుని, అప్పుడు మాత్రమే ఫొటో తీస్తే ఫ్రేమింగ్‌ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఇది ప్రాక్టీస్‌ చేస్తే ఇతరుల కంటే చూడ చక్కనైన ఫొటోలు తీయొచ్చు. ఒక ఫొటోలో ఫ్రేమింగ్‌ అనేది అత్యంత ముఖ్యమైన అంశం.

Comments