ఫేస్బుక్ మెసెంజర్, ఫేస్బుక్ యాప్ వాడేటప్పుడు, చాలామందికి Facebook Research అనే ప్రకటన కనిపిస్తుంది. ఆ యాప్‌ని ఇన్స్టాల్ చేసుకుంటే, నెలకి 20 డాలర్ల వరకూ డబ్బులు చెల్లిస్తానని ఫేస్బుక్ ప్రకటిస్తుంది.
ఇదేదో బాగుందని, చాలామంది ఫేస్ బుక్ వాడకందారులు దాన్ని డౌన్లోడ్ చేసుకుని తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇలా డబ్బులు చెల్లించడం ద్వారా ఫేస్బుక్ భారీ మొత్తంలో మన వ్యక్తిగత డేటా కలెక్ట్ చేస్తున్నట్లు తాజాగా వెల్లడైంది. ఈ Facebook Research యాప్ ఒక VPN మాదిరిగా పనిచేస్తుంది. ఇది యాపిల్, ఆండ్రాయిడ్ పాలసీలకి విరుద్ధంగా మన ఫోన్లో రూట్ యాక్సెస్ సాధించి, నిరంతరం మన ఫోన్ మీద నిఘా పెట్టి, మనం ఇంటర్నెట్ లో ఏమేం పనులు చేస్తున్నామో పరిశీలిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ సంస్థ కూడా నిర్ధారించడం గమనార్హం.
2016 నుండి ఫేస్బుక్ సంస్థ యూజర్లకి 20 డాలర్ల చొప్పున డబ్బులు చెల్లించి, Facebook Research యాప్‌ని వారి ఫోన్లో ఇన్స్టాల్ చేస్తోంది. వినియోగదారులు అమెజాన్ లో తాము కొనుగోలు చేసిన వస్తువులకి సంబంధించిన స్క్రీన్షాట్ లను కూడా పంపించవలసిందిగా ఫేస్బుక్ వారిని ప్రోత్సహిస్తోంది. ఈ యాప్ మీ ఫోన్లో ప్రత్యేకమైన సెక్యూరిటీ సర్టిఫికెట్ ఇన్స్టాల్ చేస్తుంది. ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత, ఇకపై వివిధ చాటింగ్ అప్లికేషన్ల ద్వారా మీరు మీ స్నేహితులతో మాట్లాడుకునే వ్యక్తిగత సంభాషణలు మొదలుకొని, మీరు పంపించే ఫోటోలు, వీడియోలు, ఈమెయిల్ మెసేజ్‌లు, ఇంటర్నెట్లో మీది వెదికే కీవర్డ్‌లు, వెబ్ బ్రౌజింగ్ యాక్టివిటీ, మీ లొకేషన్ డీటెయిల్స్ వంటి పూర్తిస్థాయి సమాచారం ఫేస్బుక్ సేకరిస్తూ ఉంటుంది.
కొన్నేళ్ల క్రితం Onavo అనే VPN సర్వీస్ ద్వారా కూడా ఫేస్బుక్ ఇదే రకమైన డేటా కలెక్షన్ విధానానికి పాల్పడిన విషయం గుర్తుండే ఉంటుంది.
Courtesy : Computer Era
Comments
Post a Comment